తోటి జడ్జిలతో గొడవకు దిగిన మోనాల్!
on Apr 28, 2021
'సుడిగాడు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన హీరోయిన్ మోనాల్ గజ్జర్. ఆ తరువాత టాలీవుడ్ లో ఒకట్రెండు సినిమాలు చేసిన ఈమెకి సరైన గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో ఆమె టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసింది. సుదీర్ఘ విరామం అనంతరం బిగ్ బాస్ షో కోసం మళ్లీ తిరిగి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయినప్పటి నుండి మోనాల్ క్రేజ్ పెరిగిపోయింది. తన లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత ట్రయాంగిల్ లవ్ స్టోరీతో బాగా ఫేమస్ అయింది. గేమ్ పరంగా కంటే లవ్ ట్రాకులతో హౌస్ లో ఎక్కువ కాలం ఉండగలిగింది. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత మోనాల్ కి ఆఫర్లు తెగ వస్తున్నాయి.
ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'అల్లుడు అదుర్స్' సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ప్రముఖ ఛానెల్ లో ఓంకార్ నిర్వహిస్తోన్న 'డాన్స్ ప్లస్' అనే షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది మోనాల్. ఈ షో కోసం మొదట్లో గ్లామరస్ గా కనిపిస్తూ వచ్చిన మోనాల్.. ఈ మధ్యకాలంలో సంప్రదాయబద్ధంగా కనిపిస్తోంది. ఇటీవల మోనాల్ మెంటర్ గా వ్యవహరిస్తోన్న టీమ్ కి తక్కువ స్టార్లు రావడంతో షో నుండి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో మోనాల్ చాలా ఎమోషనల్ అయింది.
ఇక రీసెంట్ గా ఈ షోకి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. ఇందులో మోనాల్ మిగిలిన జడ్జిలు అందరితో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. తన టీమ్ ని సపోర్ట్ చేయలేదని మోనాల్ చెబుతున్న సమయంలో యశ్వంత్ మాస్టర్ కలుగజేసుకొని ఆమెకి కౌంటర్ ఇచ్చాడు. దానికి బాబా భాస్కర్ చప్పట్లు కొట్టాడు. దీంతో ఆమెకి కోపం మరింత పెరిగింది. ''ఎందుకు చప్పట్లు కొడుతున్నారు. ఇప్పుడు ఏమైందని..? దయచేసి అందరూ సైలెంట్ గా ఉండండి'' అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయింది. ఈ ప్రోమో ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తోంది.